ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వం, పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని వారు ప్రశ్నించారు. తమ నిరసనను తెలియజేసేందుకు నల్ల దుస్తులు ధరించిన ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, ఆ హక్కును అడ్డుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.ధర్నా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Admin
ప్రజా పిలుపు