ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ! నకిలీ తుపాకీ, రెండు కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు సంగారెడ్డి, నవంబర్ 6: జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపి ఉంచిన కార్లను లక్ష్యంగా చేసుకొని, ప్రయాణికులను నకిలీ తుపాకీ, కత్తులతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి జిల్లాలో నమోదైన మూడు దారి దోపిడీ కేసులతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో జరిగిన మరో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి నేరాలకు ఉపయోగించిన నీలం రంగు యమహా R15 ద్విచక్రవాహనం, నకిలీ ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు, సెల్ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఈ కేసుల వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలో వరుసగా చోటుచేసుకున్న దారి దోపిడీ ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలను విశ్లేషిస్తూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నాలుగు దోపిడీ ఘటనలకు పాల్పడిన ముఠా సభ్యులను గుర్తించి పట్టుకున్నారు. చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిపై అక్టోబర్ 17వ తేదీ రాత్రి సుమారు 11.10 గంటల సమయంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులోని వ్యక్తులను నిందితులు నకిలీ తుపాకీ, కత్తులతో బెదిరించి రెండు బంగారు గాజులు, బంగారు పుస్తెలతాడు, బంగారు, డైమండ్ నెక్లెస్, ఉంగరం, రూ.2,500 నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 108/2026 కింద కేసు నమోదైంది.అదేవిధంగా అక్టోబర్ 25వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన మరో కారులోని వ్యక్తులను బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై సదాశివపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 580/2026 కింద కేసు నమోదైంది. అదే రోజు తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కారును లక్ష్యంగా చేసుకొని అందులోని వ్యక్తులను ఆయుధాలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. ఈ ఘటనపై కోహీర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 173/2026 కింద కేసు నమోదైంది. వీటితో పాటు అక్టోబర్ 22, 23 తేదీల మధ్య రాత్రి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హుమ్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్-65పై కూడా ఇదే తరహాలో దారి దోపిడీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.మహారాష్ట్రలోని లాతూర్, పూణే, బారామతి ప్రాంతాలకు చెందిన నిందితులు ఒక ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై ప్రయాణిస్తూ, అత్యవసర కారణాలతో నిర్మానుష్య ప్రాంతాల్లో కార్లను నిలిపి ఉంచిన వారిని లక్ష్యంగా చేసుకునేవారు. తమ ద్విచక్రవాహనాన్ని కొంత దూరంలో నిలిపి, ముఖాలు గుర్తుపట్టకుండా మంకీ క్యాప్‌లు ధరించి కార్ల వద్దకు వెళ్లేవారు. వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకీ, కత్తులతో కార్లలో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును బలవంతంగా దోచుకునేవారు. అనంతరం ద్విచక్రవాహనంపై మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి పారిపోయేవారు. దోచుకున్న బంగారు ఆభరణాలను తమకు పరిచయమున్న వ్యక్తి సహాయంతో లాతూర్‌లోని బంగారు దుకాణంలో విక్రయించి, వచ్చిన డబ్బులను పంచుకునేవారని ఎస్పీ తెలిపారు.మరోసారి తెలంగాణలో దోపిడీలకు పాల్పడేందుకు ప్రణాళిక రూపొందించుకొని మహారాష్ట్ర నుంచి నీలం రంగు నంబర్ ప్లేట్ లేని యమహా R15 ద్విచక్రవాహనంపై ముగ్గురు నిందితులు బయలుదేరారు. వారి వెంట నల్లని మాస్కులు, స్వెట్టర్లు, రెండు కత్తులు, నకిలీ ఎయిర్ పిస్టల్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని బైక్‌పై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన మూడు దారి దోపిడీలు, కర్ణాటకలోని హుమ్నాబాద్ ఘటనలో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.అరెస్టయిన వారిలో మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి తాలూకా తాండూల్వాడికి చెందిన హసన్ సమీర్ షేక్ అలియాస్ హసన్ జమీర్ షేక్ (32), పూణే జిల్లా ఇందాపూర్ తాలూకా గొథండి గ్రామానికి చెందిన సంతోష్ సెగర్ ధగుడు (35), ప్రస్తుతం ఇందాపూర్ తాలూకా లోణి గ్రామంలో నివసిస్తున్న నౌషాద్ జాకీర్ సయ్యద్ అలియాస్ నౌషాద్ (24) ఉన్నారు. మరో నిందితుడు మహారాష్ట్రలోని లాతూర్ పట్టణానికి చెందిన రఫీక్ షంషోద్దీన్ షేక్ (28) పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.అరెస్టయిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన హసన్ సమీర్ షేక్‌పై మహారాష్ట్రలోని నాందేడ్, లాతూర్ తదితర జిల్లాల్లో గతంలోనే దోపిడీలు, దొంగతనాలు సహా పలు నేరాలకు సంబంధించి 12 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. సంతోష్ సెగర్ ధగుడుపై కూడా మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ఎంఐడీసీ, బెల్వాండి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయుధ చట్టం, దోపిడీకి సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాకు చెందిన నిందితుల నేర చరిత్రపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో నేరాలకు ఉపయోగించిన నీలం రంగు నంబర్ ప్లేట్ లేని యమహా R15 V3 ద్విచక్రవాహనం, ఒక నకిలీ స్ప్రింగ్ యాక్షన్ ఎయిర్ పిస్టల్, కొబ్బరి బొండం నరికే కత్తి, చెక్క పిడితో ఉన్న మరో కత్తి, రెండు నల్లని క్యాప్‌లు, మూడు స్వెట్టర్లు, ఒక బ్యాగ్, రెండు ఆధార్ కార్డులు, మూడు సెల్ఫోన్లు ఉన్నాయి. దోచుకున్న బంగారు ఆభరణాలను లాతూర్ ప్రాంతంలో విక్రయించినట్లు విచారణలో వెల్లడైందని, వాటి విక్రయానికి సహకరించిన వ్యక్తి, బంగారు దుకాణం వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచవద్దని, అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంకులు, ధాబాలు, హోటళ్లు వంటి జనసంచారం ఉండే సురక్షిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని సూచించారు. వాహనాలు బ్రేక్‌డౌన్ అయినా, టైర్ పంక్చర్ అయినా లేదా ఇతర అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్ 112 లేదా జాతీయ రహదారి పెట్రోలింగ్ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ స్పష్టం చేశారు. ఈ నాలుగు దారి దోపిడీ కేసులను సమర్థవంతంగా ఛేదించిన సీసీఎస్, జహీరాబాద్ సబ్ డివిజన్, సదాశివపేట పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.సంగారెడ్డి జిల్లా ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు