ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : శేరిలింగంపల్లి: అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు నిరసన ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, మమత, మారబోయిన రవి యాదవ్, అలావుద్దీన్ పటేల్‌తో పాటు నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం తెలంగాణ రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు.ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతును అణచివేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరగడాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు.బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు.
Admin
ప్రజా పిలుపు