ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆలయ కమిటీ, అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త శ్రీమతి మెట్టు రమాదేవి–కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ బి. భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కుర్ర సత్యనారాయణ, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్, పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి తదితరులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం సాయి తేజ,మహేష్, ఐశ్వర్య ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగాఆకట్టుకున్నాయి.చిన్నారులు,కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాయి. కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు అభినందించి బహుమతులు అందజేశారు.అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అలాగే కాజు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. భక్తులు భజనల్లో పాల్గొని శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సప్పన్నదేవ్, సీపీఐ ప్రకాష్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నీలంమధు ముదిరాజ్‌తో పాటు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, అన్నప్రసాద వితరణతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు