ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.జోగిపేట పట్టణంలోని వినాయక నిమజ్జనాలు జరగనున్న జోగిపేట–ఆందోల్ చెరువును గురువారం జిల్లా ఎస్పీ సందర్శించారు. నిమజ్జనానికి సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిమజ్జన ప్రాంతాల్లో ముందుగానే బారికేడింగ్, భద్రతా లైటింగ్, క్రేన్‌లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.వినాయక శోభాయాత్రలు సాగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు.నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.ఎస్పీ వెంట జోగిపేట సీఐ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ కిష్టారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాస్, ఎంఆర్ఓ మధుసాగర్ రెడ్డి, జోగిపేట ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు