ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, దేవాదాయ శాఖ ఈవో దేవనాదం తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.శ్రావణమాసం సందర్భంగా ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 9 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం రుద్రహోమం, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉదయం ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.సెప్టెంబర్ 10న మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 9 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సెప్టెంబర్ 8 త్రయోదశి సాయంత్రం 6 గంటలకు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే ఆగస్టు 23, సెప్టెంబర్ 7 తేదీల్లో ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అన్ని కార్యక్రమాల్లో విశేషంగా, పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు