ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బొల్లారం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ సీఐ సుధీర్ కుమార్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.బొల్లారం డివిజన్ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొల్లారం సీఐ సుధీర్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగీలాల్, సీనియర్ ఉపాధ్యాయురాలు విక్టోరియాను శాలువాలతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సీఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని విద్యార్థులకు వివరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, నైతికతను నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల సేవలు ఎంతో గొప్పవని అన్నారు.మన భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందని, ‘ఆచార్యదేవోభవ’ అనే భావన మన సంస్కృతిలో గురువుల గొప్పతనాన్ని తెలియజేస్తుందని సీఐ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభ, ఆలోచనా విధానం, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా నిశితంగా గమనిస్తారని అన్నారు. చదువుపై శ్రద్ధ తగ్గినప్పుడు లేదా విద్యార్థులు పక్కదారి పట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు వారిని మందలించి, సరైన మార్గంలో నడిపించే బాధ్యతను గురువులు నిర్వర్తిస్తారని తెలిపారు.జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక గురువు కృషి తప్పకుండా ఉంటుందని సీఐ సుధీర్ కుమార్ అన్నారు. విద్యార్థులు తమ గురువులను ఎల్లప్పుడూ గౌరవిస్తూ, వారు చూపించే మార్గంలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు