ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైదరాబాద్, ఆగస్టు 23: సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్ కొత్వాల్‌గా విశేష సేవలందించిన రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి సేవలు చిరస్మరణీయమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అన్నారు. శనివారం అబిడ్స్‌లోని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన వెంకట్రామిరెడ్డి 157వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వెంకట్రామిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్ ఎస్బీ ఇన్‌స్పెక్టర్ హరీష్‌కు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి స్మారక బంగారు పతకాన్ని, సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ రవికి కేవీ రంగారెడ్డి స్మారక బంగారు పతకాన్ని అందజేసి అభినందించారు.సజ్జనర్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులోనే అమీన్‌గా పోలీసు శాఖలో చేరిన వెంకట్రామిరెడ్డి దాదాపు 14 ఏళ్లపాటు హైదరాబాద్ కొత్వాల్‌గా విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు. పోలీసు విధులకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమానికి కూడా ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. ఆయన సమర్థతను గుర్తించిన నిజాం ప్రభుత్వం ‘రాజా బహదూర్’ బిరుదుతో, బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించిందన్నారు. ఆయన సేవలకు గుర్తుగా పోలీస్ అకాడమీకి రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీగా నామకరణం చేసినట్లు తెలిపారు.1918లో గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి చదువుకునే పేద విద్యార్థుల కోసం వెంకట్రామిరెడ్డి వసతి గృహాన్ని ప్రారంభించారని సీపీ పేర్కొన్నారు. ఈ వసతి గృహంలో చదువుకున్న వారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి, మాజీ గవర్నర్ బి. సత్యనారాయణరెడ్డి, యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి. రాంరెడ్డితో పాటు పలువురు న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఉన్నారని వివరించారు.1933లోనే మహిళల కోసం వసతి గృహం, నారాయణగూడలో బాలికల పాఠశాల, మహిళా కళాశాలను ఏర్పాటు చేసి బాలికా విద్యను ప్రోత్సహించిన గొప్ప దార్శనికుడు వెంకట్రామిరెడ్డి అని సజ్జనర్ కొనియాడారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి తరం యువత సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. జీవితంలో లక్ష్యాలను సాధించాలంటే పట్టుదల, అంకితభావం,కష్టపడి చదివే తత్వం అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, దానికి బానిసలుగా మారవద్దని హితవు పలికారు. ఆన్‌లైన్ మోసాల బారిన పడి పలువురు యువతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.తల్లిదండ్రులు పిల్లలతో తగినంత సమయం గడుపుతూ, సాంకేతిక వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థులు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సజ్జనర్ ఆకాంక్షించారు. రాజా బహదూర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న సొసైటీ అధ్యక్షుడు ఎం. వెంకట రంగారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ జి. గోపాల్‌రెడ్డి తదితరులను అభినందించారు.
Admin
ప్రజా పిలుపు