ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : నారాయణఖేడ్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నారాయణఖేడ్ పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు వ్యవహరించిన తీరును, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌరవ నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతులకు సంబంధించిన హామీలు, రైతు భరోసా, పంటలకు గిట్టుబాటు ధర, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కూటర్ల పంపిణీ, కౌలు రైతులకు న్యాయం, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. హామీల అమలు జరిగే వరకు బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు