ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : పటాన్‌చెరు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావును పటాన్‌చెరు శాసనసభ్యులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదివారం ఎర్రవల్లిలో ప్రత్యేకంగా కలిశారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కేసీఆర్‌కు వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకపోవడంతో పలు అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 22ఏ నిషేధిత జాబితా అంశాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. దీని కారణంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో 50 వేల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో చేరినట్లు తెలిపారు. ఈ సమస్యపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి బాధిత ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కేసీఆర్‌ను కోరినట్లు పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Admin
ప్రజా పిలుపు