ప్రజా పిలుపు / తెలంగాణ / వనపర్తి : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కాలువల సమస్యలను పరిష్కరించి రైతులకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన బడ్జెట్ కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.ఆత్మకూరు మండలంలో పునాది గాని కాలువ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించిన సందర్భాల్లో ప్రభుత్వం కొద్దిపాటి నిధులు కేటాయిస్తూ పనులు జరుగుతున్నట్లు చూపిస్తోందని అన్నారు. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఆలోచించి, పెండింగ్ ప్రాజెక్టులు, కాలువల పూర్తికి తగిన బడ్జెట్ కేటాయించి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించే పాదయాత్రను ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలాగే ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, సీనియర్ నాయకులు రచ్చ గోవర్ధన్, మండల నాయకులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి, మల్లెల శ్రీశైలం, వెంకటరెడ్డి, నరసింహ, కేశవులు, సత్తయ్య, రాములు, యాదయ్య, రాజు, ఎల్లయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు