ప్రజా పిలుపు / తెలంగాణ / కరీంనగర్ : * గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ, ప్రజల్లో దేశభక్తి, గోసంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం గోసమేత తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి నగరంలో విశేష స్పందన లభించింది.నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. కరీంనగర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని ప్రారంభించారు.తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వరకు సాగి తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా గోసంరక్షణ ఆవశ్యకత, దేశభక్తి, గోమాత పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. భారీ జాతీయ జెండాతో సాగిన ర్యాలీ నగరవాసులను ఆకట్టుకుంది.కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాతరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య మద్విరాజ్, భారత రాష్ట్ర సమితి నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, సహ వ్యవస్థాపకులు జూపెల్లి ధీరజ్, వేణు, దీపక్, ఆదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు