ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని బీరంగూడ డివిజన్‌లోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్ శనివారం శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ (ఐఏఎస్)ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ మాట్లాడుతూ.. బీరంగూడ పరిధిలోని పలు ప్రధాన కాలనీల్లో అంతర్గత రోడ్లు పూర్తిగా గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని, వర్షాలు పడిన సమయంలో కాలనీలు జలమయమై దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళల్లో స్థానికులు, మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలలో తక్షణమే తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను కూడా మెరుగుపరచాలని కోరారు.అనంతరం ఈ సమస్యలపై జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ సానుకూలంగా స్పందించారు. బీరంగూడ పరిధిలోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనులు, వీధి దీపాల ఏర్పాటును పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు