ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్,:బీరంగూడ డివిజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్ కాలనీ సాయి స్కూల్ ఆవరణలో సద్దుల బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ఆలపించిన బతుకమ్మ, జానపద గీతాలతో కాలనీ ప్రాంగణం మార్మోగింది. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడబిడ్డలందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వేదికలపై తన గళంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ ఇక్కడికి విచ్చేసి స్థానిక ఆడబిడ్డల్లో మరింత ఉత్సాహం నింపడం సంతోషకరమని తెలిపారు. స్థానిక కాలనీవాసుల ఐక్యతతో ఇంత పెద్ద ఎత్తున సంబరాలు విజయవంతం కావడం గర్వకారణమని ఆయన అన్నారు.అనంతరం గాయని మధుప్రియ మాట్లాడుతూ.. గతంలో వినాయక నిమజ్జన వేడుకలకు ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, మళ్లీ పవిత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలకు తనను ఆహ్వానించిన నందారం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని, ఇంతటి ఆత్మీయ వాతావరణంలో ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇంత ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించినందుకు స్థానిక మహిళలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ వేడుకలను ఏర్పాటు చేసిన నందారం నరసింహ గౌడ్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులపై గౌరమ్మ, దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మహిళలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు