ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : హైద్రాబాద్ నగరంలోని పీర్జాదిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను హత్య చేసిన ఆరోపణలపై భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), ఆయన భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న గొడవ జరిగింది. ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టి సెంట్రింగ్ కర్రతో తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం సత్యనారాయణ వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని సునీత తన కుమారుడికి చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడంతో పాటు సునీతను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Admin
ప్రజా పిలుపు